ఏపీ కేబినెట్లో పొదుపు విప్లవం.. ఎస్కార్ట్ లేకుండా ఒకే వాహనంలో మంత్రులు
- ఆర్భాటాలను పక్కన పెట్టిన ఏపీ మంత్రులు
- లోకేశ్ ఏర్పాటు చేసిన విందుకు కాన్వాయ్ లేకుండా ఒకే వాహనంలో వచ్చిన మంత్రులు
- రెండు వాహనాలతో సీఎం క్యాంపు కార్యాలయానికి మంత్రి నారాయణ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో 'పొదుపు మంత్రం' అమలవుతున్న తీరు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అంతర్జాతీయ చమురు సంక్షోభం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుకు స్పందిస్తూ, ఏపీ మంత్రులు తమ విలాసాలను పక్కనపెట్టి సామాన్యుల తరహాలో పొదుపు చర్యలు చేపట్టడం ఒక గొప్ప ముందడుగు.
ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ ఇప్పటికే తమ భద్రత, కాన్వాయ్ విషయంలో పొదుపు పాటిస్తుండగా... ఇతర మంత్రులు కూడా అదే బాటలో నడుస్తున్నారు. ఈ ఉదయం సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రి నారా లోకేశ్ ఏర్పాటు చేసిన అల్పాహార విందుకు మంత్రులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రులు నిమ్మల రామానాయుడు, అనిత, గుమ్మడి సంధ్యారాణి, సవిత, కొల్లు రవీంద్ర, పార్థసారథి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి, పయ్యావుల కేశవ్ తదితరులు ఎస్కార్ట్ వాహనాలను పక్కనపెట్టి, కేవలం ఒక్కో వాహనంలోనే సీఎం కార్యాలయానికి చేరుకున్నారు.
గతంలో మంత్రి నారాయణ కాన్వాయ్‌లో తన సొంత వాహనంతో పాటు మరో నాలుగు వాహనాలు ఉండేవి. ఇప్పుడు ఆ కాన్వాయ్‌లో ఏకంగా 50 శాతం తగ్గించుకుంటూ నారాయణ కీలక నిర్ణయం తీసుకున్నారు. కేవలం రెండు వాహనాలతోనే ఆయన నేడు సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు.